కేరళ బార్ల కేసు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంలో వాదించేందుకు రంగంలోకి దిగిన అటార్నీ జనరల్
కేరళలో బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల తరఫున సుప్రీంకోర్టులో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించేందుకు అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ రంగంలోకి దిగడం విమర్శలకు దారితీసింది. ఓ రాష్ట్ర ప్రభుత్వ మద్యం విధానాన్ని బార్ల యజమానులు సవాలు చేస్తుంటే, ఆ కేసులో స్వయంగా అటార్నీ జనరల్ వాదించేందుకు కేంద్రం ఎలా అంగీకరిస్తుందని కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ విమర్శించారు. మద్యం అలవాటును తగ్గించాలని తాము ప్రయత్నిస్తుంటే, కేంద్రం అందుకు వ్యతిరేకంగా నడుస్తోందని ఆయన అన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ 28న జరగనుండగా, ఆ రోజు వాదించేందుకు రోహత్గీని అనుమతించరాదని ప్రధాని మోదీకి లేఖను రాయనున్నట్టు ఆయన వివరించారు. మామూలుగా కేంద్రం తరఫున వివిధ కేసులలో వాదించే అటార్నీ జనరల్ ఇలా ప్రైవేటు వ్యక్తుల పక్షాన వకాల్తా తీసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. అయితే, తాను వ్యక్తిగత హోదాలోనే ఈ కేసులో వాదిస్తున్నానని, వీరు తనకు పాత క్లయింటులు అనీ రోహత్గీ చెబుతున్నారు.